ఏపీ కాంట్రాక్టు కార్మికులకు తీపి కబురు.. సర్కారు వరం ?

Chakravarthi Kalyan

 

ఏపీలో వివిధ మంత్రిత్వ విభాగాల్లో తాత్కాలికంగా పని చేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కారు వరాల వర్షం కురిపిస్తోంది. వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలంటూ వారు కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని రాష్ట్ర కేబినెట్‌ తెలిపింది.

 

ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు కావాల్సిన సమాచారం మొత్తం కోడీకరించి అందించేందుకు, సూచనలు, సలహాలు చేసేందుకు అధికారుల బృందం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అటవీ, పర్యావరణ, ఆరోగ్య, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలల విద్యాభివృద్ధి బృందం, దీనికి ఆర్థిక ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

 

 

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ రిపోర్టు జూన్‌ 30వ తేదీ వరకు ఇవ్వాలని సూచించడం జరిగింది. అలాగే... సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలుకు కూడా ఏర్పాటు చేయబడిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా ఈ కమిటీ పనిచేస్తుంది. 2020 మార్చి 31 లోగా సీపీఎస్‌ రద్దుకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. గతంలోనూ చాలా మంది నాయకులు ఇలా కాంట్రాక్టు ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో హామలు గుప్పించారు తప్పతే ఒక్కరూ దీన్ని అమలు చేయలేదు. ఇప్పడు జగన్ సర్కారుతోనైనా తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని వారు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: